‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్

  • 'సర్'తో ముస్లింలను టార్గెట్ చేస్తారన్న అజారుద్దీన్
  • ప్రజలు తమ ఓట్లను కాపాడుకోవాలని సూచన
  • తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని వెల్లడి
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను ఉపయోగించి ముస్లింల ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి అజారుద్దీన్... ‘సర్’ అందరికీ వర్తించే అంశమే అయినా, ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారు అని ఆరోపించారు.

పశ్చిమబెంగాల్, బీహార్‌లలో ముస్లింల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలోనూ అలాంటి కుట్రలు జరగవచ్చని హెచ్చరించారు. ‘సర్’ ప్రక్రియలో తొలగించే ఓట్ల మీదే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని, ప్రజలు తమ ఓట్లను స్వయంగా కాపాడుకోవాలని మంత్రి సూచించారు. 

తాను తెలుగులో మాట్లాడటం కొంత ఇబ్బందిగా ఉంటుందని అజారుద్దీన్ స్పష్టం చేశారు. “తెలుగు చదవడం, రాయడం వచ్చు. చిన్నప్పుడు ప్రాక్టీస్ చేశాను. కానీ మాట్లాడటం సులభంగా ఉండదు. తప్పులు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. సులభంగా ఉండే భాషలోనే మాట్లాడతాను” అని వివరించారు. 

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అద్భుతమైన పాలన అందిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, కేసీఆర్ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 200 మందికి పైగా ప్రజల సమస్యలు పరిష్కరించానని, పబ్లిసిటీపై తనకు మోజు లేదని అన్నారు.

Mohammad Azharuddin
Special Intensive Revision
Muslim voter list deletion
Telangana politics
Revanth Reddy government
Voter list conspiracy

More Telugu News